టాలీవుడ్ అందాల కథానాయికల్లో ఒకరైన తమన్నా భాటియా ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి విజయాలతో కొనసాగుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఆమె సంపత్ నంది స్వీయ నిర్మాణ సంస్థ అయిన సంపత్ నంది వర్క్ టీమ్స్, మధు క్రియేషన్స్ బ్యానర్స్ పై యువ దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తున్న ఓదెల 2 మూవీ చేస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలై అందర్నీ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇందులో తమన్నా నాగ సాధువు పాత్ర చేస్తుండగా ఇతర పాత్రల్లో హెబ్బా పటేల్, వశిష్ట, ఎన్ సింహ, యువ, నాగమహేష్, వంశీ, గగన్ విహారి తదితరులు నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా అందర్నీ ఆకట్టుకుంది.
దానితో సీక్వెల్ అయిన ఓదెల 2 పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే ఓదెల 2 మూవీ యొక్క టీజర్ ని ఫిబ్రవరి 22న కుంభమేళాలో భాగంగా రిలీజ్ చేయనున్నారు. దాదాపుగా 144 సంవత్సరాల అనంతరం వచ్చేటువంటి ఈ మహా కుంభమేళాలో భాగంగా అలహాబాద్ లోని ప్రయాగరాజ్ లో గంగా, యమునా, సరస్వతి, నదుల సంగమంలో దేవతల దీవెనల నడుమ ఈ మూవీ టీజర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. వీలైనంత త్వరలో ఈ మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ కసరత్తు చేస్తోంది.