మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకుంది.
అయితే ఇటీవల పలు చిన్న సినిమాల యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వెళ్లి తనవంతుగా వాటికి ప్రమోషన్ చేస్తూ బాసటగా నిలుస్తున్నారు మెగాస్టార్. రెండు రోజుల క్రితం విశ్వక్సేన్ లైలా మూవీ ఈవెంట్ కి వెళ్లి టీమ్ కి శుభాభినందనలు తెలిపారు. నాటి ప్రజారాజ్యమే నేడు జనసేన గా రూపాంతరం చెందిందని అన్నారు.
ఇక నిన్న బ్రహ్మ ఆనందం మూవీ ఈవెంట్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ, ఇకపై పూర్తిగా తన లైఫ్ సినిమాలకే అంకితం అని అన్నారు. అలానే రాజకీయాలు ఇక కళ్యాణ్ బాబు చూసుకుంటాడు, తన జనసేన పార్టీ తరపున అతడు రాజకీయంగా పోరాడతాడని అన్నారు. అప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉండాల్సింది అని, ఆ సమయంలో ప్రశాంతత లేక హాయిగా నవ్వుకోలేకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని, ఆ విషయం తన సతీమణి సురేఖ కూడా అప్పట్లో తనతో అనేవారని అన్నారు.
అందుకే ఖైదీ నెంబర్ 150 మూవీ తరువాత ఇకపై సినిమాల్లోనే ఉండాలని భావించానన్నారు. ప్రస్తుతం వస్తున్న యువ దర్శకులతో వర్క్ చేయాలని ఉందని, అనిల్ రావిపూడితో మూవీ సమ్మర్ లో మొదలవుతుందని తెలిపారు మెగాస్టార్.