అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ స్పై సినిమా ఏజెంట్. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించగా యువ అందాల కథానాయిక సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ సంస్థల పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈమూవీకి హిప్ హాఫ్ తమిళ సంగీతం సమకూర్చగా ఇతర ముఖ్య పాత్రల్లో బాలీవుడ్ నటుడు డినో మోరియా, విక్రమ్ జీత్ విర్క్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల, మురళి శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటించారు.
2023 ఏప్రిల్ 28న గ్రాండ్ గా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయింది. ముఖ్యంగా అఖిల్ నటుడిగా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలు దీనికి పెద్ద మైనస్.
అయితే అప్పటి నుండి ఓటిటి రిలీజ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం సోనీ లివ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది ఏజెంట్. కాగా ప్రస్తుతం ఈమూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎంతమేర ఓటిటిలో మెప్పిస్తుందో చూడాలి.