ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేడు ప్రత్యేకంగా మీడియాతో సమావేశం అయ్యారు. కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు అలానే హరిహర వీరమల్లు రిలీజ్ కి సంబంధించిన పలు విషయాలపై ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలోని ఎగ్జిబిటర్లు థియేటర్ ఓనర్లకు సంబంధించిన కాంట్రవర్సీ గురించి ఆయన మాట్లాడారు. రెంటల్ తో వర్సెస్ పర్సంటేజ్ సిస్టం పై కొన్నేళ్లుగా సమస్య కొనసాగుతుందని దీనికి ఏది కరెక్ట్ సొల్యూషన్ అనేది ఇప్పటివరకు తేల్చలేదని అన్నారు.
వాస్తవానికి ఏప్రిల్ 19న గోదావరి జిల్లాలకు చెందిన ఎగ్జిబిటర్లు వారి యొక్క నిర్ణయాలను తెలిపారని అన్నారు. అయితే ఏప్రిల్ 26న గిల్డ్ మీటింగ్ సందర్భంగా దానిని చర్చించి చెప్తామని తెలిపినట్లు చెప్పుకోచ్చారు. ఇక తాను నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమాని తానే పైరసీ చేసినట్లు కొన్ని మీడియా వర్గాల వారు తప్పుడు ప్రచారం చేశారని ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి మేము తీసిన సినిమానే మేమే పైరసీ చేసి ఎందుకు నాశనం చేసుకుంటాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అలానే హరిహర వీరమల్లు సినిమా జూన్ లో రిలీజ్ అవుతుంటే థియేటర్స్ క్లోజింగ్ సమస్యను దానికి ముడిపెడుతున్నారని నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ ఎవరు బంద్ చేయరని అంత సాహసం ఎవరికీ లేదని అన్నారు. థియేటర్స్ ఎగ్జిబిటర్లకు సంబందించి ఇటీవల మీటింగ్ జరిగిందని, అయితే అందులో మాట్లాడిన వాస్తవాలు ఎవరికి తెలియదని చెప్పుకొచ్చారు. ఎటువంటి డిస్కషన్ జరగకుండా థియేటర్స్ బంద్ అనేది ఉండదని ఎవరో కొందరు కావాలని ఈ విషయమై తప్పుడు సమాచారం అందించారని క్లారిటీ ఇచ్చారు.
కొన్ని వర్గాల మీడియా వారు పెద్ద ఇష్యూస్ పై వార్తలు రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి రాయాలని ఇండస్ట్రీలో ఆ నలుగురిలో తాను ఒకడని కావాలని థియేటర్స్ ని బ్లాక్ చేస్తున్నానని చెప్పి వార్తలు రాయడం తప్పని అన్నారు. కాగా ఈ విధంగా తనతో పాటు మరికొంతమంది పెద్ద ప్రొడ్యూసర్స్ ని కూడా టార్గెట్ చేస్తూ వార్తలు రాయటం కరెక్ట్ కాదని అన్నారు.