పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పాటు తన సినిమాల షూటింగులో కూడా పాల్గొంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఆఫ్ స్క్రీన్ లో పెద్దగా పార్టీలు గట్రా జరుపుకునే వ్యక్తి కాదు, ఆయన ఇతర హీరోలను చాలా అరుదుగా కలుస్తారు, కానీ ఇతర సూపర్ స్టార్ హీరోలతో కలిసి ఆయన్ని చూడటం తన అభిమానులకు కన్నుల పండుగలా అవుతుందని చెప్పవచ్చు.
ఇక తాజాగా నందమూరి బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పటికే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు పవన్ కళ్యాణ్ వస్తారనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ నెలాఖరులో ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ కూడా ప్రారంభం కానుందట.
అయితే ఆ ఎపిసోడ్ కు ముందే పవన్ కళ్యాణ్ తో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ ప్రస్తుతం తన వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇక పవన్ కళ్యాణ్ ఈ షూటింగ్ స్పాట్ లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా వైరల్ గా మారింది. అయితే, ఇది అనుకోకుండా జరిగిన సమావేశమా లేదా ప్రణాళిక ప్రకారం చేయబడిందా అనే దాని పై ఇంకా స్పష్టత లేదు. అయితే, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య కొద్దిసేపు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ సాధారణ ఆఫ్ స్క్రీన్ లుక్ లో కనిపించగా, బాలకృష్ణ షూటింగ్ లో పాల్గొన్న కారణంగా కాస్ట్యూమ్ తో కనిపించారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇక ముందుగా చెప్పుకున్నట్లు పవన్ కళ్యాణ్ రాబోయే ఎపిసోడ్ తో బాలయ్య ఈ అన్‌స్టాపబుల్ సీజన్ ను ముగించబోతున్నారని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ కూడా ఈ ఎపిసోడ్ కు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ ను సంక్రాంతి కానుకగా లేదా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేసే అవకాశం ఉంది.