తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఈ రోజు రాత్రి నుంచి మూడు తెలుగు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవనున్నాయి. సుడిగాలి సుధీర్ ‘గాలోడు’, సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనియం’, బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ యొక్క లక్కీ లక్ష్మణ్ ఈ మూడు సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి.
జబర్దస్త్ సుధీర్ నటించగా అద్భుతమైన కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను అబ్బురపరిచి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన గాలోడు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ఓటీటీ హక్కుల ద్వారా కూడా మంచి మొత్తాన్ని రాబట్టిన ఈ సినిమా ఫిబ్రవరి 17 అంటే ఈ రాత్రి నుంచి ఆహా వీడియో, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
అనిల్ కుమార్ దర్శకత్వంలో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమా సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన వారంతా ఇది ఓటీటీకు సరిపోయే కంటెంట్ ఉందని, థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వెళ్లుంటే బాగుండేదని భావించారు.
ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో దేవీప్రసాద్, పవిత్ర లోకేష్, సత్యం రాజేష్, సప్తగిరి, కేదార్ శంకర్, రూప లక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి కళ్యాణం కమనియం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదలై సినీ ప్రేక్షకులని ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ నటించిన కొత్త చిత్రం లక్కీ లక్ష్మణ్ కూడా ఈ రోజు రాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఏ.ఆర్.అభి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోహెల్ సరసన మోక్ష నటించగా, దేవీప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.