ఇటీవలే విడుదలైన అద్భుతమైన టైటిల్ రివీల్ వీడియోతో సూర్య నటించిన కంగువ ట్రేడ్ వర్గాల్లో, ఇండస్ట్రీలో అదిరిపోయే స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. ఈ వీడియోలో అద్భుతమైన సిజిఐ మరియు గ్రిప్పింగ్ విజువల్స్ ఉన్నాయి, ఇది ఇటీవలి కాలంలో వెల్లడించిన ఉత్తమ గ్లింప్స్ లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన దర్శకుడు శివ ఇంత తక్కువ సమయంలోనే ఈ తరహా ఫలితాన్ని ఇవ్వడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
ఇక సూర్య నటించిన ‘కంగువ’ పూర్తిగా కొత్త ప్రపంచంలో సాగుతుందని, ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని ఇస్తుందని దర్శకుడు శివ వెల్లడించారు. భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ తో ఈ సినిమా నిండి ఉంటుందని, ఇటీవల వీడియో తరహాలోనే ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. ఈ సినిమా 2డి, 3డి వెర్షన్లు ఒకేసారి అన్ని భాషల్లో విడుదల కానున్నాయి. కంగువ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాగా, శివ అండ్ టీం 2024 ప్రారంభంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ట్రేడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. హిందీ భాషను మినహాయించి ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో 80 కోట్లకు దక్కించుకుంది. ప్రైమ్ లో ఓ తమిళ సినిమాకు ఇదే బిగ్గెస్ట్ డీల్ గా నమోదైంది. మొత్తంగా చూసుకుంటే దళపతి విజయ్ నటించిన లియో తర్వాత నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన రెండో బిగ్గెస్ట్ డీల్ కంగువ సినిమాకే జరిగింది.
స్టూడియో గ్రీన్ పతాకం పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 10 భాషల్లో ‘కంగువ’ భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. బాహుబలి వంటి సీరీస్ కు ఇది తమిళ సినిమా పరిశ్రమ నుంచి సమాధనంగా ఉంటుందని తమిళ సినీ వర్గాలు భావిస్తున్నాయి.