సూరరై పోట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాకి దర్శకత్వం వహించి విశేషమైన స్పందనతో పాటు జాతీయ అవార్డు గ్రహీతగా కూడా ఖ్యాతి గాంచిన దర్శకురాలు సుధా కొంగర ఇప్పుడు విజయవంతమైన పారిశ్రామికవేత్త రతన్ టాటా జీవితం పై మరో బయోపిక్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారని తాజాగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో సూర్య లేదా అభిషేక్ బచ్చన్ నటించే అవకాశం ఉంది.
సూరరై పోట్రు సినిమా కోసం సూర్య మరియు సుధ కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. సూర్య సుధా కొంగరను చాలా నమ్ముతారు. కాగా వారిద్దరూ కలిసి పని చేసిన మొదటి సినిమా సమయంలో నిజానికి సూర్య పరిస్థితి ఏమంత బాగోలేదు.
అటు నటుడిగా ఇటు స్టార్ గా తన స్థాయి తగ్గిపోతున్న దశలో కెరీర్ లో అత్యంత అవసరమైన ప్రశంసలను తెచ్చిపెట్టింది. నిజానికి ఈ సినిమా ఓటిటిలో విడుదలైనా.. ఒక బ్లాక్ బస్టర్ సినిమా తరహాలో సూర్య నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చింది.
ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త తన కలను ఎన్నో అసమానతలు ఉన్నప్పటికీ వెన్ను చూపకుండా లక్ష్యాన్ని వెంబడించే పాత్ర కథగా తెరకెక్కిన చిత్రం సూరరై పోట్రు. జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ కథనే సుధా అంత చక్కగా తీస్తే.. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదగడానికి రతన్ టాటా చాలా సవాళ్లను ఎదుర్కొన్నందున, రతన్ టాటా జీవితాన్ని అన్వేషించడం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సుధా సినిమాలు దక్షిణ, ఉత్తర అంటూ భేదాలు లేకుండా అంతటా వ్యాపించే విధంగా రూపొందుతాయి. అందుకే, ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాలో నటించడం కోసం అభిషేక్ బచ్చన్‌ని కూడా పరిశీలిస్తున్నారట.
తెలుగులో ఆంధ్ర అందగాడు సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన సుధా చివరగా సూరరై పొట్రుకు దర్శకత్వం వహించింది. సూర్య మరియు అపర్ణ బాలమురళి ఈ చిత్రంలో నటించారు, ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు మరియు ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్ GR గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ మరియు ఉత్తమ స్క్రీన్ ప్లేతో సహా ఐదు అవార్డులను గెలుచుకుంది.