గత కొన్నేళ్లుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ టాలీవుడ్ లో చెప్పుకోదగిన పేరుగా వెలుగొందుతోంది. ఇండస్ట్రీలోని పెద్ద స్టార్స్ తో వరుసగా భారీ బ్లాక్ బస్టర్స్ ను నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ఇక మీదట బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టే ఆలోచనలో ఉంది.
ఇక సంప్రదాయబద్ధంగా డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజు, ఏషియన్ గ్రూప్ వారు ఆధిపత్యం చలాయిస్తున్న నైజాం ఏరియాలో ఇటీవల డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలోకి మైత్రీ వారు అడుగుపెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ స్టార్ట్ చేసి తాము తాజాగా నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలను ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసింది.
కాగా ఈ రెండు సినిమాలు నైజాంలో తొలి రోజు 7 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించాయి.తొలి రోజు వీరసింహారెడ్డి జీఎస్టీతో కలిపి రూ.7.1 కోట్లు, వాల్తేరు వీరయ్య రూ.7.15 కోట్ల షేర్ వసూలు చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్ కు ఇది భారీ ఆరంభం అని చెప్పుకోవచ్చు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు పోటీగా వారసుడు అనే డబ్బింగ్ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు తీసుకున్న నిర్ణయంతో ఈ సంక్రాంతి సీజన్ ఇప్పటికే వేడెక్కింది. ఇదంతా వ్యాపారంలో భాగమే అయినా కేవలం మూడేళ్ళకే దిల్ రాజు తాను గతంలో చెప్పిన మాటను మార్చి ఇతర భాషల నుంచి డబ్బింగ్ వెర్షన్ల కంటే స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునివ్వడంతో ఆయన కపటత్వాన్ని పలువురు ఇది వరకే తప్పుబట్టారు.
అయితే మైత్రీ మూవీస్ అన్ని సమస్యలను అధిగమించడం పెద్ద కష్టమైన పనే అని అందరూ భావించినా.. ఎగ్జిబిటర్ల నుంచి స్క్రీన్లు పొందడం దగ్గర్నుంచి సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలను విజయవంతంగా విడుదల చేయడం వరకూ అన్ని పనులు సరిగ్గా అయ్యేలా చూసుకున్నారు.