సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష సినిమా గత కొన్ని రోజులుగా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 21, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. నూతన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటించారు.
నిన్న విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది .ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ భావోద్వేగానికి గురై తన యాక్సిడెంట్ గురించి, కుటుంబంతో బంధం గురించి, దర్శకుడు సుకుమార్ గురించి మాట్లాడారు. అలాగే తాను పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా పై వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ పై కూడా సాయిధరమ్ తేజ్ స్పందించారు.
సాయిధరమ్ తేజ్ – సముద్రఖనిల కాంబోలో ‘వినోదయ సీతం’ (తమిళ రీమేక్)లో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డైలాగులు మరియు స్క్రీన్ ప్లే ఇస్తుంది మరెవరో కాదు త్రివిక్రమ్. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే ఈ సినిమాలో మార్పులు ఉండేలా ఆయన జాగర్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని, ఆయనను తాను ఎంతో గౌరవిస్తానని, గురువుగా భావిస్తానని సాయి తేజ్ అన్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని మెగా అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా సాయి ధరమ్ తేజ్ భరోసా ఇచ్చారు. ఇక ఈ సినిమాను ఆపేయాలని సోషల్ మీడియాలో అభిమానుల ట్రోల్స్ ను తాను చూశానని, అయితే సినిమా చూశాక అభిమానులు గర్వంగా ఫీలవుతారని, కాలర్ ఎత్తుకుంటారని మరో సారి ఆయన స్పష్టం చేశారు.
ఇక విరూపాక్ష విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాల పై బీవీఎస్ఎన్ ప్రసాద్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక రహస్యం దాగి ఉన్న పల్లెటూరి నేపథ్యంలో థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. కాగా అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ప్రకారం ఈ సినిమాలోని విజువల్స్, పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.