మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఈ వారం విడుదలై తొలి రోజు మిశ్రమ స్పందనను రాబట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా రెండో రోజు మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పతనాన్ని చవిచూసింది.
తొలి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4.4 కోట్ల షేర్ వసూలు చేయగా, ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్లకు చేరువలో రాబట్టింది. అయితే రెండో రోజు వసూళ్లు తగ్గుముఖం పట్టి తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2.2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. రావణాసుర థియేట్రికల్ బిజినెస్ విలువ 23.5 కోట్లు కాగా, ఈ సినిమా బ్రేకప్ స్టేటస్ అందుకోవాలంటే కలెక్షన్లలో పెద్ద జంప్ కావాలి.
రవితేజ విలక్షణమైన క్యారెక్టరైజేషన్ తో పాటు సుధీర్ వర్మ ఆసక్తికరమైన కథాంశం ప్రేక్షకులను రావణాసుర సినిమా వైపు ఆకర్షించింది. మాస్ మహారాజా అద్భుతమైన ఫామ్ లో ఉండటంతో ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని అందరూ భావించారు.
రవితేజ ఆర్టీ టీమ్ వర్క్స్, అభిషేక్ నామా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రావణాసుర’. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, సుశాంత్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ తదితరులు నటించారు.
క్రిమినల్ లాయర్ అయిన రవి (రవితేజ) కథే ఈ సినిమా. హారిక (మేఘా ఆకాష్) కేసు వాదించేందుకు ఒప్పుకుని దాని పై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అదే సమయంలో నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలతో రవికి సంబంధం ఏమిటనే విషయమే రావణాసుర సినిమా మిగతా కథ.