ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం నటించిన రంగమార్తాండ సినిమా రెండు రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలో ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ఈ సినిమా ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 విభాగంలో మొదటి స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. థియేటర్లలో విడుదలకు ముందే స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకు ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. రిలీజ్ రోజున క్రిటిక్స్ కూడా ఈ సినిమాను మెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీలో ఈ చిత్రానికి తగిన గౌరవం లభిస్తోంది.
హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.
ఈ చిత్రం మరాఠీ చిత్రం “నటసామ్రాట్” కు అధికారిక రీమేక్. రంగమార్తాండ అనే బిరుదు పొందిన ప్రముఖ రంగస్థల నటుడు రాఘవరావు కథే ఈ రంగమార్తాండ. రిటైర్ అయ్యాక చిన్న కూతురికి పెళ్లి చేసి తన ఆస్తిని పెద్ద కొడుకు భార్యకు ఇచ్చి ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడపాలనుకుంటాడు. అయితే పరిస్థితులు అందుకు అనుగుణంగా జరగక పోవడంతో కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత రాఘవరావు, అతని భార్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది మిగతా కథ.