పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా పై ఈ మధ్య కాలంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజీత్ స్టైలిష్ టేకింగ్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్క్రీన్ పెర్ఫార్మెన్స్ యొక్క కాంబినేషన్ కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా పట్ల విపరీతమైన ఉత్కంఠ ఏర్పడేలా చేసింది.
తాజాగా టైటిల్ రివీల్ తో వచ్చిన కాన్సెప్ట్ వీడియోతో ఈ సినిమా ఒక యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా ఉండబోతుందని అభిమానులతో సహా అంచనా వేస్తున్నారు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి సరిపోయేలా ఒక ట్రెండీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండే అంశాలు అన్నీ ఈ సినిమాలో ఉండేటట్లు కనిపిస్తుంది.
గత వారమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, పవన్ కళ్యాణ్ ఈ రోజు ముంబైలో ఓజీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి దర్శకత్వం వహించిన సుజీత్ ఈ పవర్ స్టార్ యాక్షన్ ప్రాజెక్ట్ తో స్ట్రాంగ్ రీఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. వరుస షెడ్యూల్స్ ను నిర్వహించి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సహా 6 నెలల్లో సినిమాను పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.