ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే అనివార్య పరిస్థితుల వల్ల, మరి కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పలుమార్లు పడటం అభిమానులను నిరాశకు గురి చేసింది.
అయితే తాజా సమాచారం ప్ర కారం ఈ నెల 29 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవ కాశం ఉందని, కాగా తొలి షెడ్యూల్ 25 రోజుల పాటు నిర్విరామంగా జరగనుందని తెలుస్తోంది.
ఇటీవల జాహ్నవి కపూర్ 26వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 చిత్ర నిర్మాతలు ఆమెను హీరోయిన్ గా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేత హరికృష్ణ కె, యువసుధ ఆర్ట్స్ పతాకం పై సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు సిరిల్ ఆర్ట్ డిపార్ట్ మెంట్ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో కె.వి.విజయేంద్రప్రసాద్ కథ అందించిన ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నటన అమోఘంగా ఉండి అందరి ప్రశంసలు అందుకుంది. రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని, ఒలీవియా మోరిస్ కీలక పాత్రలు పోషించారు.