బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన కమర్షియల్ సినిమాల పై నటుడు , దర్శకుడు వెంకటేష్ మహా ఇటీవలే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆ సమయంలో ఆయన సినిమా, హీరో పేరు చెప్పకపోయినా ఆయన మాట్లాడిన మాటలు దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 2 ను ఉద్దేశించే అన్నారని అందరికీ అర్థమైంది.
వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు, మరియు ఆయన మాటతీరు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపడంతో ఈ యువ దర్శకుడు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కమర్షియల్, మసాలా ఎంటర్టైనర్ల ప్రాముఖ్యతను కూడా ఈ వివాదం ప్రశ్నించేలా చేసింది.
కాగా తన తాజా చిత్రం దసరాను ప్రమోట్ చేస్తున్న నేచురల్ స్టార్ నాని ఈ తాజా చర్చ పై పరోక్షంగా స్పందించారు. ఆఫ్ బీట్, కంటెంట్ పరంగా మంచి సినిమాలు, అవుట్ అండ్ అవుట్ మైండ్ లెస్ ఎంటర్ టైనర్స్ కూడా మిక్స్ చేసిన ఆయన ఫిల్మోగ్రఫి కలిగిన నానిని ఓ ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాల గురించి, భారతీయ సినిమాల్లో వాటి ప్రాముఖ్యత గురించి తన అభిప్రాయాలను పంచుకోమని అడిగారు.
కేవలం కమర్షియల్ సినిమాల కారణంగానే మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఉన్నత స్థాయిలో ఉందని నాని అన్నారు. కమర్షియల్ సినిమాలు లేకపోతే ఇండస్ట్రీలో డబ్బు, ఆదాయం ఉండదని ఆయన అన్నారు. అలాంటి సినిమాలు లేకపోతే ఎవరైనా మంచి సినిమాలు తీయడానికి సాహసించరు ఎందుకంటే ఎవరూ థియేటర్లకు రారు. మాస్, కమర్షియల్ సినిమాలే ఇండియన్ సినిమాకు వెన్నెముక మరియు మూలస్తంభాలు అని నాని చివరగా చెప్పారు.
కమర్షియల్, రియలిస్టిక్ సినిమాలు రెండు తరహాల సినిమాలు కలిసి సినిమా మేకింగ్ లో ఒక చక్కని పోటీ తత్వాన్ని ఉంచాలన్న వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా.. కమర్షియల్ గా భారీ విజయం సాధించిన సినిమాలను అనవసరంగా కించపరిచే వెంకటేష్ మహా లాంటి దర్శకులకు నాని నుంచి వచ్చిన ఈ స్పందన ఒక చెప్పు దెబ్బ లాంటిది అని నెటిజన్లు అంటున్నారు.