ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి నాని నటించిన తాజా చిత్రం దసరాను అందరూ అల్లు అర్జున్ పుష్పతో పోలుస్తూ వచ్చారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీని స్ఫూర్తిగా తీసుకుని నాని లుక్, ఫీల్ ఈ సినిమాలో ఉందని చాలా మంది భావించారు. నిజానికి నాని రగ్డ్ లుక్, హెయిర్ స్టైల్, రూరల్ కాస్ట్యూమ్ డిజైన్ అన్నీ సుకుమార్ యొక్క ప్రాజెక్టును పోలి ఉన్నాయనే చెప్పాలి.
ఈ రెండు సినిమాల మధ్య నిరంతర పోలికల గురించి నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ రెండు సినిమాలు కూడా రియాలిటీలో పాతుకుపోయి, నేచురల్ పిక్చరైజేషన్ కలిగి ఉన్నాయే తప్ప దసరాకు, పుష్పకు మధ్య ఇతర పోలిక ఏమీ లేదని వెల్లడించారు. పుష్ప సినిమాలో ఉన్న ప్రపంచానికి దసరా సినిమాలో ఉన్న ప్రపంచానికి సంబంధం లేదని నాని స్పష్టం చేశారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా ప్రేక్షకులలో సాలిడ్ హైప్ క్రియేట్ చేయడంతో పాటు యూనిక్ ప్రమోషనల్ కంటెంట్, టీజర్స్ తో ట్రేడ్ వర్గాలను కూడా ఉర్రూతలూగించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, సాయి కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. తెలంగాణలోని గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం 2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికి పుష్ప సినిమాతో పోలికల మాట ఎలా ఉన్నా దసరా సినిమా నాని కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.