తెలుగు అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రస్తుతం పలువురు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మరియు కోలీవుడ్ అగ్ర నటులతో వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. మరోవైపు తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రెండు సినిమాలు నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ ఎర్నేని.
యువ దర్శకుడు వెంకట సతీష్ కిలారు నిర్మాతగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ పెద్ది. ఈ మూవీలో రాంచరణ్ మాస్ పాత్రలో కనిపిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీనిని సుకుమార్ రైటింగ్స్, వ్రిద్ది సినిమాస్ తో కలిసి మైత్రి మూవీ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇక ఈ మూవీని 2026 మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కేజిఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక భారీ మాస్ యాక్షన్ నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ యొక్క షూట్లో జాయిన్ అవ్వనున్నారు. ఈ మూవీని కూడా వచ్చే ఏడాది సమ్మర్ బరిలో నిలిపేందుకు సిద్ధమైందట మైత్రి మూవీ మేకర్స్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 9న గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకు రానుందని తెలుస్తోంది.
ఒకరకంగా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తో కేవలం రెండు వారాల గ్యాప్ లోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ రిస్క్ చేస్తోందని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే పక్కాగా ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన అఫీషియల్ డేట్ వచ్చేవరకు వెయిట్ చేయాలి మరి. అదే గనక నిజమై ఏప్రిల్ 9న ఎన్టీఆర్ మూవీ వస్తే అటు చరణ్ మూవీ ఇటు ఎన్టీఆర్ మూవీ ఏ స్థాయిలో విజయవంతం అవుతాయో, అలానే ఈ రెండిటికీ థియేటర్స్ యొక్క కేటాయింపులు ఎలా ఉంటాయో చూడాలి.