పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో తన రాజకీయ సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన చేస్తున్న మూడు సినిమాలు ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకోగా తాజాగా వాటి మూడింటిని పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారు పవర్ స్టార్.
ఇప్పటికే సుజీత్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజితో పాటు జ్యోతి కృష్ణ తీస్తున్న హరి హర వీరమల్లు షూటింగ్స్ రెండూ కూడా ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయిన పవన్ రేపు ఓజి షూట్ లో కూడా అడుగుపెట్టనున్నారు. వీటితో పాటు హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా త్వరలో తిరిగి ప్రారంభం కానుంది.
కాగా ఈ మూడు సినిమాల్లో మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి పై పవన్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. యువ దర్శకుడు సుజీత్ తీస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక హరిహర వీరమల్లు మూవీ పీరియాడిక్ భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.
కాగా వీటిలో వీరమల్లు 2025 మార్చి 28న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఓజి మూవీ 2025 ఆగష్టులో పక్కాగా రిలీజ్ కానున్నట్లు చెప్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. దీనిని బట్టి మొత్తంగా 2025 ఏడాది పవన్ ఫ్యాన్స్ కి డబుల్ బాక్సాఫీస్ బొనాంజా ఖాయం అని తెలుస్తోంది.