ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు మహర్దశ అయినట్లుగా అన్ని సినిమాలు వరుస పెట్టి విజయాలు సాధిస్తున్నాయి. ఆగస్ట్ 5న విడుదలైన కళ్యాణ్ రామ్ సినిమా బింబిసార.. పది రోజుల తరువాత కూడా బాక్స్ ఆఫీసు వద్ద అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తుంది. అంతే కాకుండా పదవ రోజున కోటి రూపాయల పైనే వసూలు చేసింది. ఇంతటి అద్భుతమైన ప్రదర్శనతో పాటు ఎన్నో ప్రశంసలను సంపాదించుకున్న బింబిసార చిత్రం అందుకు నిజంగానే అర్హత ఉన్న సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వారం మాచర్ల నియోజకవర్గం మరియు కార్తికేయ 2 రూపంలో రెండు కొత్త సినిమాలు విడుదల అయ్యాయి. వాటిని తట్టుకుని నిలబడటం అంటే అది ఖచ్చితంగా సామాన్యమైన విషయం కాదు.
ఇక 10 రోజుల తర్వాత, కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి అంటే.. ప్రపంచ వ్యాప్తంగా 28.5 కోట్ల రూపాయల భారీ షేర్ ను వసూలు చేసింది. అంతే కాకుండా ఈ సినిమా వ్యాపారంలో భాగమైన అందరికీ లాభదాయకంగా మారింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలకు జరుపుకుంది. ఆ రకంగా చూసుకుంటే మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఇక బింబిసార సినిమా భారీ విజయం సాధించడంతో.. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పార్ట్ 2ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. 500 BC నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం బింబిసారుడి కథను ప్రేక్షకులకి చూపించింది, ఒక క్రూరమైన అధికార దాహంతో ఉన్న రాజు ఎలా ఒక మంచు మనిషిగా మారాడు అనేది ఈ చిత్ర కథ. ఫాంటసీ డ్రామాతో పాటు టైం ట్రావెల్ వంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ఈ సినిమావిమర్శకుల ప్రశంసలతో పాటు అద్భుతమైన ఆదరణను పొందింది.
నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వివాన్ భటేనా కీలక విలన్ పాత్రలో నటించారు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.