ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ నుంచి దర్శకుడుగా మారిన వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. సెకండ్ వీకెండ్ లో అద్భుతంగా ఆడిన ఈ సినిమా నైజాం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. పాజిటివ్ రిపోర్ట్స్, స్ట్రాంగ్ మౌత్ టాక్ కారణంగా ఫస్ట్ వీకెండ్ కంటే సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ ఎక్కువగా ఉండటం విశేషం.
ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను, అందులోని ప్రజలను ప్రభావితం చేసే విషాదాలను, సంప్రదాయాలను వాస్తవికంగా చిత్రించిన చిత్రమిది. కాగా స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది మరియు బాక్సాఫీస్ వద్ద ఫలితం కూడా అందుకు తగ్గట్టే ఉంది. విమర్శకులు మరియు ప్రేక్షకులు ఈ చిత్రానికి బలమైన పుష్ ఇచ్చారు.
ఇప్పటి వరకూ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబర్చిన ఈ చిత్రానికి 10వ రోజు బెస్ట్ డే గా నిలిచింది. కాగా 10వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేయగా ఒక్క నైజాం ఏరియా నుంచే 2/3వ వంతు కలెక్షన్స్ వచ్చాయి. భారీ తారాగణం లేకుండా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిన్న సినిమాకు ఇది చాలా భారీ విజయం అనే చెప్పాలి.
బలగం చిత్రంలో మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా దర్శకుడు వేణు కూడా ఒక సహాయక పాత్రలో కనిపించారు. హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు.