ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ తెరకెక్కించిన అవతార్ సిరీస్ లోని రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్ నుండి ఎంతటి గొప్ప ప్రజాదరణని అలానే కలెక్షన్ ని సొంతం చేసుకున్నాయనేది మనకు తెలిసిందే. ప్రత్యేకంగా అవతార్ సిరీస్ సినిమాలకు ఎందరో అభిమానులు ఉన్నారు.
ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన అవతార్ 1 మూవీ అప్పట్లో అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న మూవీగా ప్రపంచఖ్యాతిని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల వచ్చిన అవతార్ 2 కూడా రెండు బిలియన్స్ కి పైగా కలెక్షన్ సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే, వీటి అనంతరం రూపొందుతోన్న అవతార్ సిరీస్ లోని మూడవ మూవీ అయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీని 2025 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 19న గ్రాండ్ గా ప్రపంచం మొత్తం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేసారు.
గత రెండు సినిమాలకు మించేలా మరింత గ్రాండియర్ రేంజ్ లో విఎఫ్ఎక్స్ ఈ మూవీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. జాన్ లండావు తో కలిసి జేమ్స్ క్యామరూన్ ఈ మూవీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్ మరియు స్టీఫెన్ ల్యాండ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మరి అందరిలో ఎన్నో అంచనాలు కలిగిన ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అనంతరం ఏస్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.