ఆస్కార్ అవార్డ్స్ 2023లో చారిత్రాత్మక విజయం సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాతలకు, నటీనటులకు అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పై చిత్రీకరించిన నాటు నాటు పాట 95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ వేదిక పై భారతదేశం గర్వపడేలా చేసిన తెలుగు పాటకు అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారత దేశానికి ఒక భారీ విజయం అంటూ ట్వీట్ చేశారు. ఆస్కార్ అవార్డ్స్ లో ఓ తెలుగు పాటకు అందరూ ఊగిపోవడం చూసి మురిసిపోయానని చెప్పారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణిగారికి, రచయిత చంద్రబోస్ గారికి, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ గార్లకి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అభినందనలు తెలిపారు.
అలాగే హీరో ఎన్టీఆర్ తో పాటు ఈ సినిమాతో ఇంతటి అద్భుత విజయాన్ని సాధించినందుకు ఎస్ ఎస్ రాజమౌళికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు. అయితే అల్లు అర్జున్ తన ట్వీట్ లో ఎన్టీఆర్ ను తెలుగు ప్రైడ్ అనడం ప్రస్తుతం పెద్ద దుమారం రేగింది.
ఎన్టీఆర్ ను తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తిగా ఆయన అభివర్ణించడం కాస్తా వివాదానికి దారి తీసింది. అందుకు మెగా ఫ్యాన్స్ ఏమాత్రం సంతోషించక ఆయన పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల మధ్య అసాధారణమైన, బలమైన బంధం ఉందని, అందుకే ఎన్టీఆర్ ను ఈ విధంగా ఎలివేట్ చేశారని అంటున్నారు.