అఖిల్ అక్కినేని స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ ఏప్రిల్ 28 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కాగా విడుదలకు ముందు ఎంతో ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్న హీరో అఖిల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అఖిల్ ప్రకారం ఏజెంట్ ఆలోచన మొదటి లాక్డౌన్ సమయంలోనే మొదలైంది. తనకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టమని, అలాంటి సినిమాను పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (నేను ఇతర సినిమాలను కించపరచడం లేదు అని చెబుతూ) వరకు తనకు ఆ పూర్తి సంతృప్తి లభించ లేదని అఖిల్ చెప్పారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు ప్రేక్షకుల్లో మరింత ఆదరణ లభించినా కానీ తను ఇక యాక్షన్ సినిమా చేయాలనుకున్నారట.
అఖిల్ ఇంతకు ముందు ఇలాంటి పాత్ర తాను చేయలేదని, ఏజెంట్ లో తన పాత్ర కోతిలా ప్రవర్తించాలని, అంటే తన ప్రవర్తన ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పారు. చాలా వైల్డ్ గా ఉండే రిక్కి అనే పాత్రలో తాను నటిస్తున్నానని, ఊహించని విధంగా ఆ పాత్ర కొన్ని సందర్భాలను డీల్ చేస్తుందని అఖిల్ తెలిపారు. తన పాత్ర అనూహ్యయమైన విధంగా ఒక అడవి కోతిలా ఉంటుందని అన్నారు. సీరియస్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆ పాత్ర హాస్యాన్ని తీసుకొస్తుందట.
అంతే కాదు ఏజెంట్ పూర్తిగా హీరో క్యారెక్టర్ తో మాత్రమే నడిచే సినిమా కాదని అఖిల్ చెప్పుకొచ్చారు. ఇందులో మూడు పాత్రల మధ్య ఇంటెన్స్ డ్రామా ఉంటుందని, మరీ ముఖ్యంగా ప్రతి పాత్రకు గౌరవం ఉంటుందన్నారు. అలాగే మమ్ముట్టి లాంటి నటుడిని ఎందుకు ఎంచుకున్నామో సినిమా చూశాక అందరికీ అర్థం అవుతుందని చెప్తూ.. అంతర్జాతీయ గూఢచారి సమస్యలతో ముడిపడి ఉన్నందున ఏజెంట్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుందని అఖిల్ హామీ ఇచ్చారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాల పై రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ సుంకర, పాటి దీపారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లులుగా వ్యవహరించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు.