సినిమా వ్యాపారంలో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ మూడు ముఖ్యమైన భాగాలుగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన పలువురు నిర్మాతలు సినిమా బిజినెస్ లోని ఈ మూడు అంశాల్లో పట్టు సాధించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టారు. దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ లకు ఈ మూడింటిలో మంచి పట్టుంది. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ క్లబ్ లో చేరబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ కూడా త్వరలోనే థియేటర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాలని చూస్తోందని సమాచారం. ఈ నిర్మాణ సంస్థ ఇటీవల వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో తొలిసారిగా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో చేరింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పలువురు టాలీవుడ్ అగ్రహీరోలతో కలిసి పనిచేసింది.
ఇప్పుడు మైత్రీకి చెందిన నవీన్ ఎర్నేని, రవిశంకర్ థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు కాబట్టి అన్ని ఏరియాల్లో థియేటర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో ఓ మల్టీప్లెక్స్ నిర్మించాలని యోచిస్తున్నారు. థియేటర్ల పై తమకు మంచి పట్టు ఉండేలా థియేటర్లను లీజుకు తీసుకునే యోచనలో కూడా వారు ఉన్నారు.
ప్రభాస్, హృతిక్ రోషన్ హీరోలుగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ను నిర్మాణ సంస్థ ఇటీవలే ఖరారు చేసింది. వీటితో పాటు విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, పుష్ప: ది రూల్, రామ్ చరణ్ 16 వంటి సినిమాలతో పాటు కొన్ని చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా వీరి చేతిలో ఉన్నాయి. ఇలాంటి లైనప్ తో భవిష్యత్తులో ఎగ్జిబిషన్, స్క్రీన్ కేటాయింపు వద్ద సమస్యలు రాకుండా కొన్ని థియేటర్లు తమ ఆధీనంలో ఉంటే బాగుంటుంది అనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది.