ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. తాజా వార్తల ప్రకారం, ర్యాష్ డ్రైవింగ్, కారు పైకప్పు పై కూర్చోవడం మరియు వాహనాల బృందానికి నాయకత్వం వహిస్తూ హైవేని అడ్డుకోవడం వంటి కారణాలతో ఆయన పై కేసు నమోదు చేయబడింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ కార్యక్రమం కారణంగా నివాసాలు కోల్పోయిన స్థానికులతో పవన్ ఇటీవలే ఇప్పటాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.
ఆ సందర్భంగా పవన్ బయటకు వస్తున్న సమయంలో ఓ హైవే పై పవన్ తన కారు పై భాగంలో కూర్చుని ప్రయాణించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఇదే విషయమై పవన్ పై పోలీస్ కేసు నమోదైంది. ప్రమాదకర ప్రవర్తన వల్ల పవన్ పై కేసు నమోదైంది.
తాడేపల్లి పోలీస్ ఈ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా పవన్ పై ఐపీసీ 336, 177 ఎంవీ యాక్ట్ కేసు నమోదు చేశారు. అంతేకాదు ప్రమాదకరమైన డ్రైవింగ్ ఆరోపణల పై పవన్ కళ్యాణ్ డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేయడం గమనార్హం.
ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన ప్రజలను పవన్ కళ్యాణ్ ఇటీవలే పరామర్శించారు. ఈ ఏడాది ప్రారంభంలో జనసేన పార్టీ కార్యక్రమానికి భూమి ఇవ్వడంతో ఇప్పటం గ్రామం వార్తల్లో నిలిచింది. జనసేన మద్దతుదారుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటం గ్రామస్తుల పై ప్రతీకార రాజకీయాలు చేస్తోందని తెలుస్తోంది.
అయితే, రాజకీయ పార్టీలు అన్న తరువాత ర్యాలీలు కొత్త ఏమీ కాదు. మరి పవన్ కళ్యాణ్ పై ఈ విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రజా జీవితంలో, రాజకీయ నాయకుల పై కేసులు ఇలా అసంబద్ధ రీతిలో నమోదు చేయడం నిత్యకృత్యమేనని రాజకీయ విశ్లేషకులు ఈ మొత్తం వ్యవహారం పై వ్యాఖ్యానించారు. మరి ఈ కేసుల వ్యవహారం ఎక్కడి దాకా వెళుతుందో.. భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.