అక్కినేని నాగ చైతన్య వరుస విజయాలతో ఊపు మీద ఉన్నారు. ఆయన గత చిత్రాలు లవ్ స్టోరీ, బంగార్రాజు ప్రేక్షకులని అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఈ క్రమంలో చైతన్య నటించిన తాజా చిత్రం థాంక్యూ పై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఒక రకంగా ఈ చిత్ర దర్శకుడు కూడా ఒక కారణం అని చెప్పాలి.
ఎందుకంటే గతంలో నాగ చైతన్య, విక్రమ్ కుమార్ కలిసి చేసిన మనం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గానే కాదు అక్కినేని కుటుంబానికి మరపురాని సినిమాగా మిగిలిపోయింది. ఇక థాంక్యూ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ గానే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 25 కోట్ల బిజినెస్ జరుపుకుంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు థాంక్యూ చిత్రాన్ని నిర్మించడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చూసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన ధియేటర్ల సంఖ్య కూడా భారీగానే ఉన్నాయి. అన్నీ చక్కగా కుదిరిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలయింది.
ఇక థాంక్యూ చిత్రం టాక్ ఎలా ఉందంటే.. సినిమా తీసిన ఉద్దేశ్యం మంచిదే అయినా.. ఆచరణలో మాత్రం దర్శకుడు అనుకున్న విధంగా తెరకెక్కించ లేక పోయారని విమర్శకుల నుంచి స్పందన లభించింది. ఇక సినిమాలో పాటలు కూడా ఏవీ అంతగా పాపులర్ అవలేదు. పైగా నిడివి కేవలం రెండు గంటల తొమ్మిది నిమిషాలు అయినా.. సినిమాని సాగదీసిన భావన కలుగుతుందని ప్రేక్షకుల టాక్. సరైన పాళ్లలో అన్ని అంశాలు సినిమాలో ఇమిడి పోయి ఉంటే చిత్రం ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు అది జరిగేలా లేదని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇక ఓపెనింగ్స్ వరకూ వస్తే తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 కోట్ల షేర్ రాబట్టచ్చని అంటున్నారు. ఇవి మంచి కలెక్షన్లు అయినప్పటికీ.. సినిమాకి టాక్ బాగా లేకపోవడంతో రేపటి నుంచి కలెక్షన్లు తగ్గడం ప్రారంభిస్తాయి అని ట్రేడ్ వర్గాల అంచనా. మరి థాంక్యూ చిత్రం ఆ అంచనాని నిజం చేస్తుందా లేదా అనేది చూడాలి.
ఇక ఇదిలా ఉండగా, ఈ మధ్య తెలుగు సినిమాల ఫలితాల వరస చూస్తుంటే టైర్ టూ హీరోల చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నాని నటించిన అంటే సుందరానికీ, గోపిచంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షియల్, రామ్ పోతినేని వారియర్ ఇవన్నీ బయ్యర్లకు నష్టాలు మిగిల్చాయి. అంటే సుందరానికీ, ది వారియర్ అయితే పది కోట్లకు పైగానే నష్టపోయాయి. మరి ఇప్పుడు తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న థాంక్యూ చిత్రంతో నాగ చైతన్య ఎంత మేరకు కలెక్షన్లులు సాధిస్తాడు అనేది చూడాలి.