యువ నటుడు సందీప్ కిషన్ నటించిన తాజా పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ముఖ్య అతిథి పాత్రలో నటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచినప్పటికీ ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
సందీప్ కిషన్ మైఖేల్ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డారు. పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆయన భావించారు. అయితే ఈ సినిమా అన్ని భాషల్లోనూ పరాజయం పాలవ్వడంతో సందీప్ కిషన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట.
కెరీర్ లో హీరోగా సందీప్ కు పెద్దగా సక్సెస్ లు లేకపోయినా పెర్ఫార్మర్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో కూడా ఆయనకి అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ మామూలే అయినా ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్న ఈ యంగ్ హీరో త్వరలోనే సక్సెస్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని ఆశిద్దాం.
సందీప్ కిషన్ కు పోటీగా మైఖేల్ ప్రతినాయకుడిగా ఈ చిత్రంలో దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించారు. తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ పతాకాల పై భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించిన చిత్రం ‘మైఖేల్’. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకుడుగా వ్యవహరించారు.
బొంబాయిలో భయంకరమైన గ్యాంగ్ స్టర్ అయిన గురునాథ్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ను చూపిస్తూ మైఖేల్ కథ ప్రారంభం అవుతుంది. అతన్ని ఒక చిన్న పిల్లవాడు మైఖేల్ (సందీప్ కిషన్) ఒక హత్య దాడి నుండి రక్షిస్తాడు. అందుకే గురునాథ్ మైఖేల్ ను పెంచమని తన శిష్యుడు స్వామి (అయ్యప్ప శర్మ)ని అడుగుతాడు.
కొన్ని సంవత్సరాల తరువాత, గురునాథ్ మళ్ళీ మైఖేల్ చేత రక్షించబడతాడు, ఆ పైన అతని వ్యాపారం మరియు ఇతర ఉద్యోగాలను చూసుకోవడానికి మైఖేల్ ను నియమిస్తాడు.రతన్ (అనీష్ కురువిల్లా)ను చంపమని గురునాథ్ మైఖేల్ ను ఆదేశిస్తాడు. మైఖేల్ అక్కడికి వెళ్లి రతన్ కూతురు తీరా (దివ్యాంశ కౌశిక్)ను కలుస్తాడు. మైఖేల్ ఆ పనిని పూర్తి చేశాడా? ఆ తర్వాత అతని జీవితం ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం మిగతా కథ.