గత వారం చిన్న సినిమాగా విడుదలైన రైటర్ పద్మభూషణ్ ఎవరూ ఊహించని విధంగా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాయిని అందుకుంది.
మామూలు సందర్భాల్లో ఇది చాలా కష్టమైన పని. కాగా ప్రస్తుతం టైర్-2 హీరోలు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమవుతున్నారు. అయితే ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో, మంచి కంటెంట్ తో టార్గెట్ ఆడియన్స్ ను పూర్తిగా సంతృప్తి పరచడంలో సక్సెస్ అయిన రేటర్ పద్మభూషణ్ టీం 10 రోజుల్లోనే 10 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిపోయింది.
గతంలో తాను ప్రధాన పాత్ర పోషించిన కలర్ ఫోటో వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్న సుహాస్ అంతకు ముందు మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో తన సత్తా చాటారు. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
కాగా ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, రోహిణి అతని తల్లిదండ్రులుగా నటించారు, వారితో పాటు ఇతర కీలక పాత్రలలో కనిపించిన టీనా శిల్పారాజ్ మరియు శ్రీ గౌరీ ప్రియలు వారి సహజ నటనకు ప్రశంసలు పొందారు.
నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పద్మభూషణ్ అనే 25 ఏళ్ల ఔత్సాహిక రచయిత కథ గురించి చెప్తుంది. విజయవాడలో తన మధ్యతరగతి కుటుంబంతో నివసిస్తున్న పద్మభూషణ్ రచయిత కావాలని కలలు కంటూ ఉంటాడు. ఒక రోజు, అతను ఎవరో రాసిన పుస్తకానికి పేరు పొంది గొప్ప రచయితగా కీర్తిని గడిస్తాడు. ఆ తర్వాత తను అసలు రచయితను ఎలా కనుగొన్నాడు మరియు నిజమైన రచనలు రాయడానికి అతనికి ప్రేరణ ఎలా దొరికింది అనేది మిగిలిన కథ.
వెంకట్ ఆర్ శాఖమూరి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించారు. ఎడిటింగ్ బాధ్యతలను కోదాటి పవన్ కళ్యాణ్, సిద్ధార్థ్ తాతోలు చూసుకున్నారు. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.