గత కొన్ని రోజులుగా రంగమార్తాండ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ఈ సినిమాను చూశారని, వారు ఈ సినిమా అవుట్ పుట్ చూసి ఆశ్చర్యపోయారని అంటున్నారు. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఎమోషన్స్ అని, అవి చాలా బాగా వర్కవుట్ అయ్యాయని కూడా అంటున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఆరేళ్ల తర్వాత రంగమార్తాండ సినిమాతో వెండితెర పైకి మళ్ళీ వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2023 మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన మరాఠీ బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ కు అధికారిక రీమేక్ గా రంగ మార్తాండ సినిమా తెరకెక్కింది. నానా పటేకర్ టైటిల్ పాత్రలో నటించిన ఈ హృదయానికి హత్తుకునే డ్రామా, నటన నుండి రిటైర్ అయినా నాటకరంగం యొక్క మధుర జ్ఞాపకాలను మరచిపోలేని ఒక రంగస్థల నటుడి విషాద కుటుంబ జీవితాన్ని చిత్రిస్తుంది.
కాగా రంగమార్తాండ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తం మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. స్పెషల్ ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీకి, రంగమార్తాండ టీంకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.