లైగర్ సినిమా అత్యంత హైప్ మరియు భారీ హైప్ తో ఈ శుక్రవారం అంటే ఆగస్ట్ 25న విడుదలై ఎవరూ ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వైఫల్యం యొక్క పూర్తి భాధ్యత పూరి జగన్నాధ్ దే అన్న అభిప్రాయం అంతటా వెలువడుతుంది. ఆయన రచనా నైపుణ్యం, దర్శకత్వ ప్రతిభ పై అనేక ప్రశ్నలను లేవనెత్తింది లైగర్ చిత్ర ఫలితం. దాదాపు పదేళ్ల నుంచీ ప్రేక్షకులకి తన స్థాయికి తగ్గ సినిమాల్ని అందించడంలో పూరీ జగన్నాధ్ విఫలమవుతూ వస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి మూడు సినిమాలు చూస్తే, ఇస్మార్ట్ శంకర్, మెహబూబా మరియు పైసా వసూల్, ఈ మూడు సినిమాల్లో కేవలం రామ్ పోతినేని నటించిన ఇస్నార్ట్ శంకర్ మాత్రమే హిట్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ విజయానికి ప్రధాన కారణం మణిశర్మ పాటలు మరియు రామ్ నటన అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ దశాబ్దంలో హిట్ అయిన మూడు చిత్రాలను పరిశీలిస్తే, ఇస్మార్ట్ శంకర్ (2019), టెంపర్ (2015), మరియు బిజినెస్మేన్ (2012). ఈ సినిమాలన్నీ కేవలం పూరి వల్లే కాకుండా ఇతర కారణాల వల్ల విజయం సాధించాయనడంలో సందేహం లేదు. ఇస్మార్ట్ శంకర్ విజయంలో మణిశర్మ సంగీతం, రామ్ ఆ టైటిల్ రోల్ కు కొత్తగా అనిపించడం వల్ల ఆ సినిమా విజయం సాధించింది. ఇక టెంపర్ విషయానికి వస్తే ఆ చిత్రానికి కథ పూరిది కాదు.. వక్కంతం వంశీ కథ మరియు జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటన వల్లే ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. పైగా అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం టెంపర్ కథనంలోనూ వక్కంతం వంశీ చేయి ఉందని వినికిడి. సరే ఆ సంగతి అలా ఉంచితే .. అదే విధంగా బిజినెస్‌మెన్ సినిమా విజయంలోనూ పూర్తిగా పూరి జగన్నాథ్ పాత్ర ఉందని చెప్పలేం. మహేష్ బాబు డైలాగ్ లను పలికిన తీరు, అలాగే సూర్య భాయ్ పాత్రను రక్తి కట్టించిన తీరు వల్ల ఆ సినిమా హిట్ అయింది. అయితే దర్శకుడిగా కన్నా బిజినెస్‌మెన్ సినిమాలో రచయితగా పూరీ తన మార్క్ ను చూపించారు అని చెప్పొచ్చు.
పూరి ఒకప్పటిలా బలమైన కథ, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని దశాబ్దానికి పైగా అయిందనడానికి ఆయన పని చేసిన సినిమాలు ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం ఆయన సొంత కథలను ఏమాత్రం ఆసక్తికరంగా మలచలేక పోతున్నారు. కావున ప్రస్తుతం ఆయనకు ఒక బలమైన కథా రచయిత అవసరం. విజయ్ దేవరకొండతో జనగణమన సినిమా పూరి తదుపరి చేయబోతున్న చిత్రం. మరి ఈ సినిమాతో విమర్శలకు ఆయన సమాధానం చెబుతారా లేదా చూడాలి.