దక్షిణ భారత దిగ్గజ దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్లో RC 15 చిత్రం ఈ సంవత్సరం ప్రారంభంలో షూటింగ్ ప్రారంభించబడింది. కాగా షెడ్యూల్ తర్వాత షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పటికే భారతదేశం అంతటా తిరిగి పలు షెడ్యూల్‌ల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అంతే కాక శంకర్ మార్కు ఉట్టిపడేలా ఒక పాటను కూడా భారీ స్థాయిలో చిత్రీకరించారు.
ఇక ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే గొప్ప తారాగణంతో పాటు అత్యుత్తమైన సాంకేతిక సిబ్బంది భాగమై ఉన్నారు. RRR లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ అభిమానులు.. తమ అభిమాన హీరోని శంకర్ దర్శకత్వంలో చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి మొదట అనుకున్నారు. కానీ ఆ తర్వాత సంక్రాంతి నుంచి వేసవికి విడుదల తేదీని మార్చారు. అందుకోసమే ఎప్పుడూ లేనిది శంకర్ కెరీర్లోనే అత్యంత వేగంగా ఈ సినిమా కోసం షూటింగుకై యుద్ధ ప్రాతిపదికన చిత్ర బృందం పని చేశారు.
అయితే, ఇటీవలే విక్రమ్ వంటి అనూహ్య భారీ విజయం సాధించడంతో, కమల్ హాసన్ తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. దాంతో భారతీయుడు 2 నిర్మాతలు ఆ ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించి షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల శంకర్ ఇప్పుడు ఏకబిగిన రెండు ప్రాజెక్టులను తెరకెక్కించే పనిలో ఉన్నారు. కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమానే తన తన తదుపరి విడుదల కావాలని ఆయన కోరుకుంటున్నారట. అందుకే కమల్ లుక్స్ దగ్గర నుంచి కథ, కథనాల పై ఎక్కువ దృష్టి పెడుతున్నారని సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, భారతీయుడు 2 సినిమా RC 15 కంటే ముందు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ రెండింటిలో ఒక చిత్రం సమ్మర్‌లో, మరో చిత్రం అక్టోబర్/నవంబర్‌లో విడుదల అవుతుందని అంటున్నారు. మరి కొందరు అయితే భారతీయుడు 2 సమ్మర్ 2023 లో, RC15 2024 సంక్రాంతికి విడుదల అవ్వచ్చని అంటున్నారు. మరి ముందు ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.
RC 15 లో కియారా అద్వానీ, SJ సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరో వైపు ఇండియన్ 2లో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ కనిపించబోతున్నారు.
ఈ రెండు సినిమాలు కూడా అటు కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక సందేశాలతో కూడిన భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్లుగా తెరకెక్కుతున్నాయి.