పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరోవిజయ్ దేవరకొండ నటించిన లైగర్.. ప్రేక్షకుల్లో భారీ హైప్ మరియు ఆసక్తిని ఏర్పరుస్తూ.. ఈ శుక్రవారం అనగా ఆగస్టు 25 న థియేటర్లలో విడుదలైంది. సినిమా పై ఉన్న క్రేజ్ కారణంగా, ఈ చిత్రం మొదరు రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ ను సంపాదించింది. అయితే సినిమాకు ప్రేక్షకుల నుండి దారుణమైన టాక్ , విమర్శకులు కూడా చీల్చి చేండాడడంతో మ్యాట్నీ షో నుండే సినిమా కలెక్షన్లు ఒక్కసారిగా కిందకి పడిపోతూ వచ్చాయి.
ఓపెనింగ్ డే తర్వాత ఆంధ్ర, తెలంగాణల్లో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఎంతగా అంటే నిన్నటి రోజున చాలా సెంటర్లలో రెంట్లు, ఇతరత్రా ఖర్చులు పోను అసలు షేర్ ఏ రాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇది మాత్రం ఎవరూ ఊహించని విషయం. ఇక లైగర్ హిందీ వెర్షన్ కూడా ప్రీమియర్ల సహాయంతో తొలి రోజు 5 కోట్ల నెట్ రాబట్టినా.. అక్కడ కూడా ఈ చిత్రానికి టాక్ దారుణంగా ఉండడంతో కలెక్షన్లలో భారీ డ్రాప్ వచ్చింది. లైగర్ చిత్రం ఎంత లేదన్నా కూడా బాక్స్ ఆఫీసు వద్ద కనీసం 50 కోట్ల నష్టాల దిశగా సాగుతోందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇప్పుడు ప్రధాన సమస్య మరియు ప్రశ్న ఏమిటంటే, ఈ నష్టాలను ఎవరు భర్తీ చేస్తారు అనేదే. లైగర్ సినిమాకి సంబంధించి టోటల్ సౌత్ ఇండియా రైట్స్‌ని ఫ్యాన్సీ మొత్తానికి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ఆయన గత చిత్రం ఆచార్య భారీ డిజాస్టర్ గా నిలచిన సంగతి తెలిసిందే. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు లైగర్ సినిమా భారీ వైఫల్యం వల్ల ఈ సినిమాని కొని ఆయన కష్టాలను మరింత పెంచుకున్నట్లు అయింది. ప్రస్తుతానికి అయితే ఈ నష్టాలకు బదులుగా వరంగల్ శ్రీను డబ్బులు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు.
నిజానికి, అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం వరంగల్ శ్రీను ఈ నష్టాలకు దర్శక నిర్మాతలైన పూరి జగన్ మరియు ఛార్మీ కౌర్ నుండి ఆశిస్తున్నారట. కానీ, పూరి మరియు ఛార్మీ కూడా ప్రస్తుతం సంక్షోభంలోనే ఉన్నారు. అసలు లైగర్ ఈ స్థాయిలో పరాజయం పాలవుతుంది అని వారు కలలో కూడా ఊహించి ఉండరు. నిజానికి వారి ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు.
అటు వరంగల్ శ్రీను కాక, ఇటు పూరి, ఛార్మీలు కాక అసలు లైగర్ నష్టాన్ని ఎవరు భరిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇన్ని కష్టాలు చాలవు అన్నట్లుగా, పూరి మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోయే తదుపరి చిత్రం అయిన జన గణ మన సినిమాకి ఇప్పుడు బడ్జెట్ మరియు బిజినెస్ సమస్యల కారణంగా ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఆ సినిమా నిజంగా తెరకెక్కుతుందా లేదా అనేది కూడా అనుమానమే అంటున్నారు.