వివాదాలు వారిసు జట్టును వదిలిపెట్టేలా కనిపించడం లేదు. నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు ఇలా అందరూ ప్రమోషన్ ఇంటర్వ్యూల సమయంలో ఓవర్ బోర్డ్ అయిపోయారు. ఈ సినిమా విడుదలకు ముందు నిర్మాత దిల్ రాజు అజిత్ కంటే విజయ్ నెంబర్ వన్, పెద్ద స్టార్ అంటూ వ్యాఖ్యలు చేయగా అవి పెద్ద వివాదానికి దారి తీశాయి.
ఇక సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాలోని ప్రతి కంటెంట్ ను హైప్ చేయగా, సోషల్ మీడియాలో హీరో విజయ్ కి ఎలివేషన్స్ ఇస్తూ వచ్చిన ప్రతి పాటను కూడా ఓవర్ పబ్లిసిటీ చేశారు. అంతటితో ఆగకుండా వారిసు సినిమా ప్రీమియర్ లో థియేటర్ లో ఏడ్చారు కూడా.. అది చూసిన వారందరికీ చాలా నాటకీయంగా అనిపించింది.
అది చాలదన్నట్లు వంశీ పైడిపల్లి ఈ సినిమా తెరకెక్కించిన తీరుకు తన పై వచ్చిన ట్రోల్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆవేశంగా స్పందించారు. తను ఒక క్లాసిక్ తీశానని ఆయన అనుకోవచ్చు. ఐతే నెగిటివ్ రివ్యూలను అంగీకరించడానికి సిద్ధంగా లేనని, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి తాము చాలా త్యాగాలు చేస్తూ కష్టపడతామని ఉపన్యాసాలు ఇస్తున్నారు.
కానీ దర్శకుడు వంశీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే తాను ఏమీ ఫ్రీగా చేయడం లేదు. తాను చేసే పనికి ఆయన కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటారు. వారిసు చిత్ర యూనిట్ తీసింది ఒక బ్లాక్ బస్టర్ కంటెంట్ కానే కాదు, అలాగే కొత్త రకానికి నాంది వేసే సినిమా కూడా కాదు.
గతంలో విడుదలైన ఎన్నో హిట్ సినిమాలను మిక్స్ చేసిన ఒక యావరేజ్ మూవీని మాత్రమే వారు ఇవ్వగలిగారు. అందుకే ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి సినిమా తొలి రోజు వరకూ నెటిజన్లు ఈ సినిమాను ట్రోల్ చేశారు.
దళపతి విజయ్ స్టార్ డమ్, సంక్రాంతి పండుగ అడ్వాంటేజ్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడానికి దోహదపడ్డాయి. నెగిటివ్ రివ్యూలు, ట్రోల్స్ సినిమా ఇండస్ట్రీలో భాగమేనని, సినిమాని ఎవరైనా ట్రోల్ చేస్తే అది తమకు నచ్చకపోతే అందుకు స్పందించే విషయంలో అతిగా వ్యవహారించకూడదని వారిసు చిత్ర బృందం అర్థం చేసుకోవాలి.