యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆదిపురుష్ టీజర్ నిన్న విడుదలైంది. అయితే దారుణమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ మరియు పేలవమైన విఎఫ్‌ఎక్స్ వర్క్ వల్ల సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ కు గురైంది. నిజానికి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ దర్శకుడు ఓం రౌత్ విఎఫ్‌ఎక్స్ వర్క్‌ను పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని చెప్పినప్పుడు, ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమకి హాలీవుడ్ స్థాయిలో టీజర్‌ను కట్ చేస్తారని ఆశించారు, కానీ అందరి ఆశలకు విరుద్ధంగా చిన్న పిల్లలు చూసే కార్టూన్ ల మాదిరిగా ఉన్న టీజర్ వచ్చింది.
ఈ క్రమంలో ఆదిపురుష్ బృందం సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కోగా, ఈ చిత్ర బృందానికి ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. దర్శకుడు ఓం రౌత్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు.
ఈ సినిమా టీజర్‌లోనే చాలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. హనుమంతుడు తోలు ధరించిన దృశ్యాలు ప్రజల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్‌ను అలాంటి సీన్లు తీసేయాలని ఆదేశించారు. ఒకవేళ అలా చేయకపోతే మటుకు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక ఇది ఇలా ఉండగా.. ఆదిపురుష్ సినిమాలోని వివిధ పాత్రల చిత్రీకరణలు సంభందించి ఆన్‌లైన్‌లో నెటిజన్లు చాలా కోపంగా ఉన్నారు. అంతే కాకుండా ఆదిపురుష్ చిత్రాన్ని బహిష్కరించాలని ట్రెండ్ ను కూడా ప్రారంభించారు.
సైఫ్ అలీఖాన్ ను రావణుడి పాత్రలో చాలా ఘోరంగా చూపించారని, లంకా రాజు అయిన రావణుడిని అవమానించారని పలువురు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈ వివాదాలన్నిటి మధ్య, ఆదిపురుష్ సినిమా కేవలం 24 గంటల్లో 101 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించగలిగింది.