కమెడియన్ వేణు యెల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రమైన బలగం బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ఈ చిత్రం గ్రామీణ తెలంగాణను వాస్తవికంగా చిత్రించడంతో పాటు మరణం చుట్టూ ఉన్న పరిస్థితులను భావోద్వేగాలతో పాటు వినోదాన్ని జోడించి చెప్పినందుకు విస్తృతంగా ప్రశంసలు పొందింది.
‘బలగం’ ఘన విజయం ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆస్కార్ సహా అంతర్జాతీయ అవార్డులకు పంపేలా దిల్ రాజును ప్రోత్సహించింది. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ. బలగంను ఆస్కార్ కు పంపాలని చూస్తున్నామని, ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా వేదిక పై రాణించడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఈ సినిమాకి ఉన్నాయని అన్నారు.
ఇటీవల రెండు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న దర్శకుడు వేణు ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ మరియు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డులను బలగం గెలుచుకుంది.
ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, కేతిరి సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన బలగం చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని రీతిలో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.