జనవరి 13న విడుదలైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుని మొదటి రోజు సాలిడ్ కలెక్షన్లను నమోదు చేయగా, రెండో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ 2 రోజులకు 44.3 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ రూ.88 కోట్లు కాగా, మొదటి వారంలోనే మొత్తం థియేట్రికల్ బిజినెస్ రాబట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించిన రవితేజను వాల్తేరు వీరయ్య యూనిట్ పట్టించుకోవడం లేదు అన్నట్లుగా కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో రవితేజ పాత్ర, ఆయన నటన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు ముందు అన్ని పోస్టర్లలో రవితేజను ఉపయోగించిన చిత్ర బృందం విడుదల తర్వాత మాత్రం దీన్ని చిరంజీవి సినిమాగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సినిమా రిలీజ్ రోజు తర్వాత నుండి మైత్రి యూనిట్ నుంచి వచ్చిన పోస్టర్స్ అన్నీ చిరంజీవి సింగిల్ పోస్టర్లే.
గత డిసెంబర్ వరకు రవితేజ కాస్త దారుణమైన స్థితిలో ఉన్నారు. 2022 లో ఆయన నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి, మరియు ఆయన నటన కూడా ఆ చిత్రాలలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
కానీ ఒక్క నెలలోనే అంతా మారిపోయింది,ఇప్పుడు సూపర్బ్ కలెక్షన్స్ తో పాటు తన నటనకు కూడా అద్భుతమైన ప్రశంసలు అందుకుంటూ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు రవితేజ.
రవితేజ గత చిత్తం అయిన ధమాకా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ ఆయన ఎనర్జీ, డ్యాన్సులు చూపించడం మినహా ఈ సినిమాలో నటనకు పెద్దగా స్కోప్ లేదు. కానీ వాల్తేరు వీరయ్య సినిమాలో మాత్రం రవితేజ తన కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచే నటనను కనబరిచారు.
ఇటీవల చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్ లో రవితేజ నటన పై చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించారు. ఆ పెర్ఫార్మెన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని, ఆ సన్నివేశానికి గ్లిజరిన్ కూడా అవసరం లేకుడా పోయిందని మెగాస్టార్ అన్నారు. రవితేజ పాత్ర విక్రమ్ సాగర్ ఐపీఎస్ గూండాల చేతిలో కత్తిపోట్లకు గురై చనిపోయే ప్రీ క్లైమాక్స్ సన్నివేశం గురించి చిరంజీవి మాట్లాడారు.