మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం వరుస పరాజయాల తర్వాత ఆయనకు ఖచ్చితంగా కావాల్సిన ఘన విజయాన్ని అందించింది. వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డితో తలపడగా, 5 సంవత్సరాల తర్వాత మరోసారి చిరు వర్సెస్ బాలయ్య పోటీని ఇరు వర్గాల అభిమానులు వీక్షించారు.
కాగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఈ చిత్రం ఇప్పుడు మరో భారీ మైలురాయిని అందుకుంది. వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తూ శుక్రవారం అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఫస్ట్ వీక్ లో 94 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం 100 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసింది. ఖైదీ నంబర్ 150, సైరా తర్వాత చిరంజీవికి ఇది మూడో 100 కోట్ల షేర్ సినిమా కావడం విశేషం.
వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద వింటేజ్ మెగాస్టార్ ను తిరిగి తీసుకురావడంతో ఈ చిత్రం వీరసింహారెడ్డి పై భారీ ఆధిక్యం సాధించింది. చిరంజీవి, రవితేజ నటించిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. వీక్ డేస్ లో కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ షోలు కనిపించాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓవర్సీస్ మార్కెట్ లోనూ మంచి వసూళ్లు రాబట్టింది.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ, పూనకాలు లోడింగ్ పాటలు విడుదలకు ముందే హిట్ అవ్వగా, సినిమాలో ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా మంచి స్పందన తెచ్చుకుంది. శ్రుతిహాసన్, కేథరిన్ థ్రెసా, బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ వంటి ప్రతిభావంతులైన నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు.