వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని తదితరులు నటించిన “ముఖచిత్రం”లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లాయర్ గా అతిథి పాత్రలో నటించారు. తాజాగా ఈ థ్రిల్లర్ కమ్ కోర్ట్ రూమ్ డ్రామా ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు.
ఫిబ్రవరి 2వ తేదీ అర్ధరాత్రి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు రచయిత/దర్శకుడు సందీప్ రాజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం కంటెంట్ కు కాస్త ప్రశంసలు లభించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం విజయం సాధించ లేకపోయింది.
మహతి (ప్రియా వడ్లమాని) అనే ఒక పల్లెటూరిలోని సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి కథే ‘ముఖచిత్రం’. డాక్టర్ రాజ్ కుమార్ (ప్లాస్టిక్ సర్జన్ గా వికాస్ వశిష్ట) ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుని నగరానికి తీసుకొస్తాడు. అయితే రాజ్ కుమార్ చిన్ననాటి ప్రేయసి అయిన మాయా ఫెర్నాండెజ్ (ఆయేషా ఖాన్) ఈ పెళ్లి వార్త తెలిసి రగిలిపోతుంది.
మహతి, రాజ్ కుమార్ పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే వారి జీవితంలో విషాదం అలుముకుంటుంది. ఒక యాక్సిడెంట్ లో మాయ చనిపోగా ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మాయ ‘మహతి’గా మారుతుంది. మహతి, రాజ్ కుమార్ ల మధ్య బంధం వరుస ఉత్కంఠభరితమైన సంఘటనలతో ఎలా మలుపులు తిరుగుతుందనేది మిగతా కథ.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ కలర్ ఫోటోకు దర్శకత్వం వహించిన సందీప్ రాజ్ ముఖచిత్రం చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, ఆయేషాఖాన్, చైతన్యరావు, రవిశంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.