‘ఫలక్ నుమా దాస్’ తర్వాత యువ కథానాయకుడు విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన రెండో చిత్రం దాస్ కా ధమ్కీ ఈ నెల 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉన్నా ఎందుకో చివరి నిమిషంలో వాయిదా పడింది.
కాగా విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి మంచి థియేట్రికల్ బజ్ ఉంది. ఆంధ్రా [6 ఏరియాలు] ప్రాంతం 3 కోట్లకు, నైజాం ఏరియా కూడా 3 కోట్లకు అమ్ముడు పోయాయి. మిగిలిన ప్రాంతాల విలువ రూ.2 కోట్లు కాగా ఓవరాల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 8 కోట్లకు చేరుకుంది.
ఉగాదికి విడుదల కానున్న దాస్ కా ధమ్కీ చిత్రం హాలిడే అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో సినిమాలు విడుదల చేయడానికి అద్భుతమైన తేదీలుగా పరిగణించే తేదీల్లో ఉగాది పర్వదినం ఒకటి కాబట్టి.
గతంలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను నిర్మాతలు విడుదల చేశారు. ఇక ఈరోజు 2.0 ట్రైలర్ ను విడుదల చేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ ట్రైలర్ మొదటి ట్రైలర్ కంటే రెట్టింపు ఉత్సాహాన్ని రాబట్టింది. ఇందులో డబుల్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్ మొదలైనవి ఉండి ఆకట్టుకున్నాయి.
దాస్ కా ధమ్కీ 2.0 ట్రైలర్ కథను మరింత వివరించి చూపిస్తుంది. సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) క్యాన్సర్ ను నయం చేసే అద్భుత ఔషధాన్ని కనిపెడతాడు. అయితే అతను ఒక యాక్సిడెంట్ లో చనిపోతే అతని స్థానం లోకి ఓ హోటల్ సర్వర్ (విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం) వస్తాడు. అతను ఆటలోకి దిగి ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది మిగతా కథ.