ఏప్రిల్ 21న విడుదలైన సాయిధరమ్ తేజ్ విరూపాక్ష ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో పాటు మంచి రేటింగ్స్ తెచ్చుకుని తెలుగు రాష్ట్రాల్లోనూ అదే ఊపుని కొనసాగించింది. ఇక సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ ఇండస్ట్రీ వర్గాల కోసం స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేయగా, ఆ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విరూపాక్ష టీం విడుదలకు సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ చూపించగా అది నిజమై ఇప్పుడు సినిమా భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.
ఈ సినిమా థియేట్రికల్స్ 25 కోట్లకు అమ్ముడుపోగా, ఓపెనింగ్ వీకెండ్ లోనే 20 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రేపటి కల్లా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా పై బాక్సాఫీస్ అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని, ఇది టైర్-2 సినిమాకి చాలా భారీ ఘనత అని అంటున్నారు.
విరూపాక్ష సినిమా సృష్టించిన థ్రిల్లింగ్ ఇంపాక్ట్ మరియు సాంకేతిక నైపుణ్యానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులవడంతో వారంతా రుద్రవనం ప్రపంచంలో లీనమైపోయారు. ముఖ్యంగా హీరోయిన్ సంయుక్త మీనన్ తన అద్భుతమైన నటనకు మంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో విడుదల కావాల్సి ఉన్నా అనుకోని కారణాల వల్ల తెలుగులోనే విడుదలైంది. బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే అపరిష్కృత అంశాల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి సుకుమార్ రచనా భాద్యతలను నిర్వర్తించారు.