బాక్స్ ఆఫీసు వద్ద విక్రమ్ జోరు ఇంకా కొనగుతుంది.కెరీర్ చివరి దశకు వచ్చేసింది అనుకున్న కమల్ ఇంత భారీ బ్లాక్ బస్టర్ కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వయసుతో సంబంధం లేకుండా సీనియర్ హీరోలు కూడా పెద్ద హిట్ లు కొట్టచ్చు అన్న నమ్మకాన్ని నిలబెట్టింది విక్రమ్.వాస్తవానికి కమల్ హాసన్ కి నటుడుగా ఎంత పేరున్నా, కలెక్షన్ల పరంగా భారీ హిట్ కొట్టి దాదాపు 15 ఏళ్లు అయింది. కానీ సరైన సినిమా పడటం దానికి టాక్ తో సహా ఇతర అంశాలు కూడా కలిసి రావడంతో భారీ హిట్ గా నిలిచింది.
తమిళనాడులో ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “విక్రమ్” ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి సీరీస్,2.0,సాహో మరియు కేజీఫ్2 తరువాత ఆ ఘనత సాధించిన ఆరో దక్షిణ భారతీయ చిత్రంగా నిలిచింది.ఇది అసలు ప్రేక్షకుల నుంచి ఇండస్ట్రీ,ట్రేడ్ వర్గాల వరకూ ఎవరూ ఊహించి ఉండరు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ పకడ్బందీ కథనానికి తోడు అనిరుధ్ ఉర్రూతలూగించే సంగీతం ఈ చిత్ర విజయానికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఈ విజయంతో బాక్స్ ఆఫీసు రేసులోకి అనూహ్యంగా వచ్చారు కమల్ హాసన్. ఇక తన పోటీదారుడు అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా మళ్ళీ తన స్థాయిలో భారీ హిట్ కొడతాడు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.రోబో తరువాత ఆ స్థాయిలో ఆయనకు విజయం దక్కలేదు.ప్రస్తుతం ఆయన నెల్సన్ దర్శకత్వంలో “జైలర్” సినిమాలో నటిస్తున్నారు. మరి ఆ సినిమాతో కమల్ విసిరిన సవాల్ కి రజినీ బదులు చేప్తారో లేదో చూడాలి.