కోలీవుడ్ లో వెర్సటైల్ యాక్టర్స్ గా పేరుగాంచిన నటులు సూర్య, చియాన్ విక్రమ్. ఈ ఇద్దరు నటులకు తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. అలానే ఇటు తెలుగుతో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ కూడా ఈ ఇద్దరు నటుల్ని ఎంతో ఇష్టపడుతుంటారు. ఇక తెలుగులోనూ వీరి సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. అయితే ఈ ఇద్దరు నటులు కెరీర్ పరంగా ఇటీవల కొన్నాళ్ళుగా ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారి శ్రమకి తగ్గ సక్సెస్ అయితే లభించడం లేదు.
వీరిద్దరిలో సూర్య నటించిన సినిమాలు వరుసగా ఓటిటిలోకి వస్తుండడం, తాజాగా రిలీజ్ అయిన కంగువ కూడా మెప్పించకపోవడం సూర్య ఫ్యాన్స్ ని ఆవేదనకు గురి చేస్తోంది. సిరుత్తై శివ తెరకెక్కించిన కంగువ మూవీ ఎంతో భారీ వ్యయంతో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందించారు. అయితే కథ, కథనాల్లో పట్టు లేకపోవడంతో కంగువ బాక్సాఫీస్ వద్ద నత్తనడక నడుస్తోంది. మరోవైపు విక్రమ్ పరిస్థితి అయితే మరింతగా ఇబ్బందికరంగా సాగుతోంది.
ముఖ్యంగా ఇటీవల వరుసగా కెరీర్ పరంగా అపజయాలతో సాగుతున్నారు విక్రమ్. ఆయన రాబోయే మూవీస్ మంచి విజయాలు అందుకుంటాయని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, తాము పోషించే క్యారెక్టర్స్ కోసం ఎంతో శ్రమ పడి ఎంతో కాలం వెచ్చించి అటు సూర్య, ఇటు విక్రమ్ 100% ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు, కానీ తీరా చూస్తే వారు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోవడం లేదు. ఆ విధంగా వారికి ఫలితాలు కేవలం 10% మేరనే ఉంటున్నాయి. మరి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఈ ఇద్దరు స్టార్స్ ఎంతమేర విజయాలు అందుకుంటారో చూడాలి.