సంక్రాంతికి విడుదల కానున్న తమిళ స్టార్ హీరో విజయ్ వారిసు (తెలుగులో వారసుడు) సినిమా మొదటి సింగిల్ విడుదల చేయడంతో ఆ చిత్ర బృందం ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. రంజితమే అనే పాటను చిత్ర బృందం నిన్న విడుదల చేసింది. ఈ భారీ పెప్పీ నంబర్ పై అభిమానులు మరియు నెటిజన్లు సానుకూలంగా స్పందించారు.
ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి తమన్ సంగీతం అందిస్తున్నడాన్న విషయం తెలిసిందే. రంజితమే పాట యొక్క లిరికల్ వీడియోలో గ్రాండ్ సెట్‌లు, వైబ్రెంట్ కాస్ట్యూమ్స్, జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్‌లతో పాటు దళపతి విజయ్ మరియు ఎమ్ ఎమ్ మానసి యొక్క అద్భుతమైన గానం కూడా ఉన్నాయి.
దళపతి విజయ్ తన డ్యాన్స్‌తో పాటు పాటలు బాగా పాడటానికి కూడా పేరుగాంచారు. ఈ రెండు అంశాలు సంగీత అభిమానులను ఎంతగానో థ్రిల్ చేశాయి, ఇది ఇప్పటికే 1.5 మిలియన్ లైక్‌లతో 19 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ఈ పాట యొక్క చివరి నిమిషంలో అభిమానులు ప్రత్యేకంగా థ్రిల్ అయ్యారు, ఉత్తేజంతో వెర్రెక్కి పోయారు అంటే అది అతిశయోక్తి కాదు. ఈ వేగవంతమైన డాన్స్ నంబర్‌కి తమ అభిమాన హీరో విజయ్ ఎలా డ్యాన్స్ చేసి ఉంటాడనే దాని పై అభిమానుల ఊహలు కొనసాగుతున్నాయి.
ఇటీవల చూసుకుంటే విజయ్ సినిమాలన్నిటిలో ఒక చార్ట్‌బస్టర్ సాంగ్ ఉండటం ఆనవాయితీగా మారింది. ఆ సదరు పాట సినిమాను ప్రేక్షకులలోకి తీసుకువెళ్లి, సినిమా పై ఎక్కువ దృష్టిని తీసుకువస్తుంది. బీస్ట్ సినిమాలోని హలమతి హాబిబో పాటకు ఎంత ఆదరణ లభించిందో మనం ఇప్పటికే చూశాము. అదే విధంగా విజయ్ పాడిన పాటలు కూడా మరింత ప్రశంసలు అందుకుంటున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలకడగా విజయాలను అందిస్తూ వచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇప్పుడు విజయ్ తో తొలిసారిగా తమిళంలో వారిసు సినిమా చేస్తున్నారు. వంశీ సాధారణంగా తన సినిమాలకు మంచి ఆల్బమ్‌లు ఉండేలా చూసుకుంటారు. బృందావనం, మున్నా, ఎవడు అందుకు మంచి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
ఇక వారిసు వంశీ – థమన్ లు కలిసి పని చేస్తున్న రెండవ చిత్రం కాగా వారు మొదట కలిసి పని చేసిన బృందావనం సినిమా వలె వారిసు సినిమా కూడా సంగీతంలో తగినంత పంచ్‌ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది.
దళపతి విజయ్ కు తోడుగా నేషనల్ క్రష్ రష్మిక అందం ఉన్న పూర్తి స్థాయి పాట మరియు అద్భుతమైన నృత్య కదలికలను చూడాలంటే మనం సంక్రాంతి వరకు వేచి ఉండాల్సిందే. అప్పటి వరకు మనం చేయగలిగింది రంజితమే యొక్క లిరికల్ వీడియోని లూప్‌లో చూడటమే.