రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం పట్ల ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా పై అందరి దృష్టి పడేలా చేయడంలో చిత్ర బృందం విజయవంతమైంది. పైగా హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్నాధ్ ల కలయికలో వస్తున్న తొలి సినిమా కావడం కూడా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండను తెరపై ఎలా చూపిస్తారో ఎలాంటి విన్యాసాలు చేయిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
ఇక లైగర్ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్‌లు ఇటివలే ప్రారంభమయ్యాయి. ఆ బుకింగ్ వరస చూస్తుంటే ఈ చిత్రం మొదటి రోజు భారీ కలెక్షన్లను సాధించేలా కనిపిస్తోంది. ప్రీ-సేల్స్ ఇప్పటికే $10K మార్కును దాటడంతో.. ట్రేడ్ వర్గాలు మార్కెట్ విశ్లేషకులు లైగర్ సినిమా నుంచి ప్రీమియర్ షోల ద్వారా భారీ నంబర్‌ను ఆశిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో చాలా గట్టి ఓపెనింగ్స్ తో మొదలయ్యే సూచనలు ఎక్కువగానే ఉన్నాయి.
లైగర్ చిత్రం మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లకు జరిగింది. ఇది విజయ్ దేవరకొండ, మరియు పూరీ జగన్నాథ్ ఇరువురి కెరీర్ లో కూడా అత్యధిక రికార్డు. లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుండగా, తల్లి పాత్రలో రమ్య కృష్ణన్, మరియు ప్రఖ్యాత బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఒక అతిధి పాత్రలో నటించారు. కరణ్ జోహార్, పూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు మలయాళంలో కూడా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో లైగర్ థియేటర్లలో విడుదల కానుంది.
విజయ్ దేవరకొండను ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు వెండితెరపై చూసి రెండేళ్లు దాటింది. ఆయన నటించిన చివరి చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14, 2020న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అందువల్ల విజయ్ అభిమానులు లైగర్ పై భారీ నుంచి అతి భారీ ఆశలతో ఎదురు చూస్తున్నారు. మరి లైగర్ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదు చూడాలి.