ఇటీవల కొన్నాళ్లుగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సార్లు అలానే సినిమా నటుల పై తాజాగా పోలీసులు కేసులు నమోదు చేసారు. కాగా వాటిలో టాలీవుడ్ యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు కూడా ఉంది. అయితే ఆ కేసులో ఆయన పేరు చేర్చడం పై తాజాగా విజయ్ టీమ్ ఒక నోట్ రిలీజ్ చేసింది.
చట్టప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేసిన హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారమవుతున్న నేపథ్యంలో తాము ఈ ప్రకటన ఇస్తున్నట్లు తెలిపారు. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని విజయ్ టీమ్ తెలియజేసింది.
ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఆయన ప్రచారకర్తగా పరిమితమయ్యారు. అలానే విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది మా టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు.
విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదని అన్నారు.