డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి వరుస డిజాస్టర్ సినిమాలతో విజయ్ దేవరకొండ కెరీర్ ఊహించని విధంగా బ్రేక్ పడినట్టు అయ్యింది. అయితే తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాల నడుమ విడుదలైన “లైగర్” కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మరి విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. విజయ్ ఈసారి ఖచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే హరీష్ శంకర్ చేతిలో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “భవదీయుడు భగత్ సింగ్” సినిమా ఉంది.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పదే పదే వాయిదా పడుతూ వస్తోంది. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఈ కాంబో పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా నిన్న జరిగిన శివ కార్తికేయన్ ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి హరీష్ శంకర్, విజయ్ దేవరకొండ ఇద్దరూ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ తన స్పీచ్ లో దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు సంగీత దర్శకుడు ఎస్ థమన్‌తో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ శివ కార్తికేయన్ గురించి కూడా మాట్లాడుతూ కొన్ని భావోద్వేగమైన వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడూ వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయినా, శివ కార్తికేయన్ ప్రయాణం అంటే తనకు చాలా ఇష్టమని విజయ్ అన్నారు. పెళ్లి చూపులు సినిమా విడుదల సమయంలోనే శివ కార్తికేయన్ నటించిన రెమో సినిమా తాలూకు పోస్టర్ లు చూశానని ఆయన తెలిపారు.
ఇక ఇదే వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడారు. తాను విజయ్ గురించి మాట్లాడితే.. అది మరో రూమర్‌కి దారి తీస్తుందేమో అని భయపడుతున్నానని అన్నారు. తన పై, విజయ్ దేవరకొండ పై చాలా రూమర్స్ వచ్చాయని హరీష్ సరదాగా చెప్పారు.
కాగా శివ కార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిన్న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.