విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉండడంతో ట్రేడ్ వర్గాలు కూడా పెద్ద మొత్తంలో ప్రి రిలీజ్ బిజినెస్ చేశారు. పైగా ఓవర్సీస్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి, సినిమాకి ముందు ఇది ఖచ్చితంగా మంచి శకునం అని చెప్పవచ్చు. సాధారణంగా అయితే, దర్శకుడు పూరీ జగన్నాధ్ సినిమాలు ఓవర్సీస్ లో అంతగా ప్రభావం చూపవు. కానీ, విజయ్ దేవరకొండ వంటి యూత్ లో భీకరమైన క్రేజ్ ఉన్న హీరోతో సినిమా చేయడంతో, బుకింగ్‌లు చాలా అద్భుతంగా ఉండడం చిత్ర యూనిట్ ని ఎంతగానో ఉత్సాహపరిచింది.
ఇక హీరో విజయ్ దేవరకొండను వెండి తెర పై ప్రేక్షకులు చూసి రెండేళ్లు దాటింది. ఆయన నటించిన చివరి చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14, 2020న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత నుంచి విజయ్ మరో సినిమా కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.’రౌడీ’ స్టార్ గా ఫేమస్ అయి విజయ్ దేవరకొండ.. లైగర్ సినిమా వచ్చిన తీరు పై చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందన్న ఆత్మ విశ్వాసం అయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
విజయ్ దేవరకొండ ఈ చిత్ర బాక్స్ ఆఫీస్ ఫిగర్ లను కూడా ముందే అంచనా వేసి మరీ చెప్తున్నారు. లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఆడుతుంది అన్న ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, తన కౌంటింగ్ రూ. 200 కోట్ల నుండి ప్రారంభమవుతుందని, అప్పటి వరకు ఎంత వచ్చినా తాను అసలు లెక్కించనని కూడా చెప్పడం విశేషం. మరి విజయ్ దేవరకొండ ఇంత గట్టి నమ్మకంతో ఉన్నారు అంటే పూరి సినిమాలో ఏం అద్భుతం చేశారో చూడాలని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో అనన్య పాండే హీరోయిన్ గా, రమ్య కృష్ణన్ హీరో తల్లి పాత్రలో నటించారు మరియు ఆగస్ట్ 25న విడుదల కానుంది. కరణ్ జోహార్, పూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లైగర్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు మలయాళంలో కూడా విడుదల కానుంది.