విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో వస్తున్న లైగర్ చిత్రం భారీ అంచనాల మధ్య రేపు విడుదలవుతోంది. ప్రేక్షకులు మరియు విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన లైగర్ విడుదలకు కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది, ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ చూస్తుంటే మటుకు చాలా అద్భుతంగా ఉన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిన కూడా బుకింగ్‌లు అద్భుతంగా ఉన్నాయి.
గత కొన్ని నెలలుగా, విజయ్ దేవరకొండ మరియు లైగర్ బృందం ప్రచార కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ మరియు మీమ్ పేజీలు లైగర్ సినిమాని బాగా ఉపయోగించుకున్నాయి. లైగర్ బడ్జెట్, సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలగు అంశాల పై భారీగా ట్రోలింగ్ జరిగిందన్న మాట వాస్తవం. అయితే అవేవీ లైగర్ చిత్ర బృందం ఆత్మ విశ్వాసాన్ని మాత్రం దెబ్బతీయలేక పోయాయి.
ఇటీవలే, హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా 200 కోట్ల మార్క్ ను చేరుకున్న తర్వాత మాత్రమే బాక్సాఫీస్ నంబర్లను లెక్కించడం ప్రారంభిస్తానని బహిరంగంగా చెప్పారు. ఈ స్టేట్మెంట్ ను కొందరు ఆత్మ విశ్వాసానికి చిహ్నంగా భావించగా, కొందరు మాత్రం విజయ్ మాటలను అతి విశ్వాసంతో చేసినవి అని ట్రోల్ చేసారు.
కానీ ఇప్పుడు లైగర్ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్‌లు, ముఖ్యంగా హిందీ వెర్షన్ కు జరుగుతున్న బుకింగ్స్ చూస్తుంటే, సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వర్గం ముక్కున వేలేసుకోవడం ఖాయం. లైగర్ సినిమా బుకింగ్‌లు అందరి అంచనాలకు మించి ఉండటమే కాకుండా.. విజయ్ దేవరకొండ ఎదుగుతున్న స్టార్‌డమ్ మరియు క్రేజ్‌కు రుజువుగా చెప్పవచ్చు.
పూరి జగన్నాధ్ మరియు విజయ్ దేవరకొండల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న లైగర్ ఇటీవలి కాలంలో అత్యంత భారీ క్రేజ్ తో వస్తున్న సినిమాగా పేర్కొనవచ్చు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, అనన్య పాండే ముఖ్య పాత్రల్లో నటించారు. మరియు మైక్ టైసన్ ఒక ముఖ్య అతిధి పాత్రలో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ పై పూరి జగన్నాథ్ – ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.