లైగర్ సినిమా విడుదలకు ముందే విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ కాంబినేషన్లో మరో సినిమా జన గణ మన ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి దర్శకుడికి కెరీర్ లో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఉదాహరణకు, రాజమౌళి ఎప్పటికైనా మహాభారతం ఆధారంగా సినిమా చేయాలనుకుంటున్నారు. ఎన్నో సార్లు ఆ సినిమా గూర్చి చెప్పిన విషయం తెలిసిందే. అలాగే పూరి జగన్నాథ్ కూడా ఎప్పటి నుంచో జన గణ మన అనే సినిమా చేస్తానని చెప్తూ వచ్చారు.
కొన్నాళ్ల క్రితమే మహేష్ బాబుతో జనగణమన సినిమా చేయాల్సి ఉంది కానీ చాలా కారణాల వల్ల ఆ సినిమా రూపుదాల్చలేదు. చాలా సంవత్సరాల తరువాత, లైగర్ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు.. విజయ్ దేవరకొండతో పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాని చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ లైగర్ సినిమా గత వారం విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన సినిమాకి అంతటి ప్రతికూల స్పందన చూసిన తర్వాత, విజయ్ దేవరకొండ తన నిర్ణయం పట్ల ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా అనుకున్నట్లు విజయం సాధిస్తే అంతా బాగానే ఉండేది. కానీ ఆ సినిమా దారుణమైన ఫలితం తర్వాత, పరిస్థితి మారిపోయింది. విజయ్ దేవరకొండ ఇక పై పూరీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. అందువల్లే జనగణమన సినిమా నుండి తప్పుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.
ఇక పూరీతో పని చేసే ఆలోచనను విజయ్ దేవరకొండ మానుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే పూరీ జగన్నాథ్ కు గడ్డుకాలం మొదలైంది అనే చెప్పచ్చు. హీరో విజయ్ దేవరకొండ మాత్రం ప్రస్తుతం అంత ఇబ్బంది పడే స్థితిలో లేరు. శివ నిర్వాణతో ఖుషి అనే సినిమా చేస్తున్న విజయ్ ఆ సినిమా పైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఆ సినిమా తర్వాత సుకుమార్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. అయితే పుష్ప-2 సినిమా పూర్తి చేసేవరకూ సుకుమార్ మరో సినిమా గురించి ఆలోచించరు. అందువల్ల విజయ్ దేవరకొండ సుకుమార్ తో కలిసి పని చేయాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.