గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ప్రేక్షకులకు ఎక్కువగా వినిపించిన సినిమా లైగర్. పూరి జగన్నాధ్ రచయితగా మరియు దర్శకుడిగా కూడా వ్యవహరించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో హీరో విజయ్ దేవరకొండ నత్తిగా సమస్యలతో బాధ పడే MMA ఫైటర్ గా నటించగా, అనన్య పాండే అతని ప్రియురాలి పాత్రలో నటించారు. రమ్య కృష్ణన్, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, విష్ రెడ్డి మరియు చంకి పాండే తదితరులు ఇతర తారాగణంలో భాగంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు.
విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే జంటగా నిన్న ఆగస్టు 25న తమ సినిమా లైగర్‌ను ప్రమోట్ చేయడానికి దేశవ్యాప్తంగా 17 నగరాలను సందర్శించారు. ఆ రకంగా సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్‌ల వద్దకు కూడా వెళ్లారు. రిలీజ్ డే రోజున, తమ అభిమానులతో కలిసి మొదటి షోను వీక్షించేందుకు హైదరాబాద్‌లోని సుదర్శన్35 MM థియేటర్‌కి చేరుకున్నారు.
అయితే ధియేటర్లో సినిమాను చూడలేక పోవటం వల్లనో, లేదా సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన వల్లనో తెలియదు కానీ.. హీరో విజయ్ దేవరకొండ చాలా నిరాశాజనకంగా కనిపించారు. బహుశా ఇంత దారుణంగా సినిమా ఫలితం ఉంటుందని కలలో కూడా విజయ్ ఊహించి ఉండరు.. అందుకే సినిమా చూస్తున్నపుడు ఆయన ఏడిచినంత పని చేశారు. పాపం నిజంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఇలా తిరస్కారానికి గురైతే ఎవరికైనా బాధ ఉంటుంది కదా.
విస్తృత స్థాయిలో ప్రచారం జరుపుకుని భారీ ఎత్తున విడుదలైన ‘లైగర్’ సినిమా ఏ దశలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ దారుణమైన పరాజయంతో అటు హీరో విజయ్ దేవరకొండతో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ పరాజయానికి పూరి జగన్నాథ్ పై చాలా కోపంతో ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో ఆయన పై ట్రోలింగ్ చేస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండ పై కూడా బాగానే ట్రోల్స్ జరుగుతున్నాయి. సినిమా మీద ఉన్న నమ్మకంతో విజయ్ ప్రచార కార్యక్రమాలలో భారీ స్టేట్మెంట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25న ఇండియా మొత్తం షేక్ అవుతుందని విజయ్ గట్టిగా స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఆగ్ హైన్ అందర్…వాట్ లగా దేంగే అంటూ సినిమాలోని డైలాగులు వల్లించి ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు.
ఇలా సినిమా ప్రమోషన్స్ లో లైగర్ గురించి విజయ్ అంత భారీగా మాట్లాడి తీరా ఇప్పుడు సినిమా విడుదలయ్యాక చూస్తే.. ఏమాత్రం విషయం లేని సినిమాలా లైగర్ నిలిచింది. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం జరిపి దేశాన్నే షేక్ చేద్దాం అనుకున్నాడా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.